Friday, February 28, 2014

ఐకమత్యమే బలము అందరికి క్షేమంబు

గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబునాయుడు  గారికి,
గౌరవనీయులైన శ్రీమతి విజయమ్మ గారికి,
ప్రియతమ జగన్ కు (సమవయస్కులము కాన ),
చిరంజీవి నారా లోకేష్ బాబుకు,
ఇదేంటి పైన ఎ ఇద్దరికో  రాయాలసిన వుత్తరం నల్గురికి రాశాడేంటి వీడికి తిక్క,అని అనుకోకండి నాకొక లెక్కవుందండి బాబు. గత వారం పార్లమెంటు లో తెలుగు జాతికి జరిగిన అవమానం తట్టుకోలేక ఈ వుత్తరం రాయవలసి వచ్చింది. నేను చెప్పే ఈ వ్యథ ను అర్థం చెసుకొండి.ఇంత వరకు మీరు పరస్పరము కత్తులు నూరుకుంటూ, ఒకరి పై ఒకరు దూషణలు చేసుకుంటున్న అదను చూసి డిల్లీ లో వున్న ముగ్గురమ్మలు కలిసి ఎంతో దివ్యంగా ఈ త్రిలింగ దేశాన్ని రెండు భాగాలు చెసారు. ఇందు లో మీ తప్పు ఏమి లేదు అని నమ్మిన వాడిని. మీలో ఒకరు తెలంగాణా కావాలని వుత్తరం ఇచ్చారనో  లేక ఇంకొకరు బెయిల్ కోసం కాంగ్రెస్ కు సహాయం చేస్తున్నారానో  అంటూ ఈ రోత పత్రికలు (రెండు వైపులూ ), ఒకరికి సింగపూర్ లో హోటల్ వుందని, ఇంకొరు మారిషస్ కు డబ్బులు పంపారని మీ మీద ఏదో రాయవచ్చు మన న్యూస్ పెపర్లన్ని వొట్టి  గ్యాస్ పేపర్ లు ఏదో వాళ్ళ జీవన భ్రుతి కోసం అలా రాస్తూవుంటాయి. తిన్నారో, తినలేదో అరిగిందో,అరగలేదో ఏదో అయిపొయింది రాష్ట్ర విభజన ముఖ్యంగా కాంగ్రెస్  అనే ఒక దుష్ట శక్తివల్ల, డిల్లీ లో కూర్చొని పల్లెల్లో వుండే అమాయక జనాల్ని మోసం చేసేవారి వల్ల. ,పైన(డిల్లీ ) వారికి భజన చేసే వారి వల్ల ఈ విభజన జరిగింది . మీ ఇద్దరి లో ఎవరు పవర్ లో వున్నా ఈ విభజన జరిగేది కాదు. మీ అందరికి  కాంగ్రెస్ గురించి చెప్పే స్థాయి నాకు లేకపోవచ్చు ఎందు కంటే మీ రెండు కుటుంబాలు ఒకప్పుడు అక్కడే వుండేవి. మీరు వుభయులు డెబ్బయ్యో దశకంలో మంచి మిత్రులు కూడా (ఫోటోలు పెట్టాను గుర్తు తెచ్చుకోండి).  
రెండు అంటున్నాను మీరు ఇరువురు మేము అభిమానించే విలక్షణ నటుడు, ముక్కు సూటిగా ధైర్యంగా మాట్లాడే,కంచు కంఠం  మంచు మోహన్ బాబు ద్వారా బందువులు కదా. కాబట్టి మీరు ఒకే కుటుంబము. మీరే కాదు మేము, మీరు  అందరమూ ఒక తెలుగు కుటుంబము. కాని మన కర్మ ఏంటో  తెలుగు కుటుంబము ప్రాంతాలవారీగా, కులాల వారిగా విడి పొయాము. బ్రహ్మణులని,రాజులని, రెడ్లు అని, కమ్మలని, కాపులని,వెలమలని  బలి జలని ఇంకా ఎన్నో ఇలా,అలా  అని చెప్పుకుంటాము కాని తెలుగువారని చెప్పుకోము మనకు భాష దగ్గర కొంచం సిగ్గు ఎక్కువ. వచ్చి రాని ఇంగ్లిషు లో మాట్లాడితే గౌరవము అని అనుకునే వెర్రి వాళ్ళం, ఇంకా ఎన్నో వర్గాలుగా విడిపొయాము, పోతూనే ఉంటాము. మంచి చెడ్డలు రెండే కులములు మంచి ఐనది మాల అయితే మాల నెనగుదున్  అన్న మహాకవి గురజాడ జాడ మరచిపొయాము. ఇండియాలోనే కాదండి తెలుగు వారు ఎక్కడి కెళ్ళిన (ప్రపంచంలో) ఇలానే వుంటారు, అంతర్జాలం లో (ఇంటర్నెట్) కూడా తిట్టుకుంటూ బ్రతుకుతారు (ఈ-తన్ను కోవడం ఇంకారాలేదు). ఇదేంటో అర్థమే కాదు. ఇంత సుందరమైన భాష మనల్ని ఇంట బయట కూడా ఒకటి చెయలెకపొయింది ఇది భాష తప్పు కాదు మన భావాల తప్పు. . మనకు అభిప్రాయ భేదాలుండ డం లో తప్పులేదు అది ఒకరినోకరిని అసహ్యించుకొనే స్థితికి తీసుకొపొరాదు. ఒక చిన్న యాస (తెలంగాణా), కొంతమంది రాజకీయ నిరుద్యోగుల ఆశ ఈ భాషను రెండు రాష్ట్రాలుగా వెరుచెయగలిగిన్ది. ఇంక  ఆ విభజన గురించి మాట్లాడను ఎందుకంటే అది గతజల సేతు భంద నము. ఇప్పుడు చెప్పేదేమిటంటే మీరు ఇరువురు ఒకటి కావాలి, ఎందుకు అని అడగొచ్చు కాంగ్రెస్ అనే దయ్యాన్ని ఆంధ్ర ప్రదేశ్ నుండి శాశ్వతంగా తరమడానికి. కంప చెట్టు లాంటి కాంగ్రెస్ ను వేరు దగ్గరనుండి కొట్టాలి (రాయలసీమ భాషలో "బుడం కంటా కొట్టురా" అంటాము). మీరు ఒకరి కొకరు లోపాయికార మద్దత్తు, అంటే ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవడం, పంచాయతి ఎన్నికల్లో లాగ (ఎక్కడ వైకాపా ఆధిక్యం వుంటే అది వారికి తెదేపా ఆధిక్యం వుంటే అదివారికన్న మాట). ఉదాహరణకు చిత్తూర్ మీది అయితే కడప వారిదన్న మాట. ఈ విధంగా  కర్నాటక సరిహద్దులోని ఈచివర నుండి ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు వరకు ఒక్క  ఎమ్మెల్లే, ఒక్క ఎంపి సీటు మాన్య కాంగ్రెస్ ప్రభువులకు దక్కకుండా చెయ్యలి. ఎవరు గెలిచినా ఎవరు ఓడిన మీలో మీరు కలహించు కోరాదు కోట్లడుకోరాడు. జరిగిందేదో జరిగింది, మీ మధ్య జరిగిన తగవులు మీరు మరచిపోవాలి, ఒకరు ఇంకొకరిని నాశనం చేయడానికి తోడ్పడ రాదు. నాలుగు ఎద్దులు పులి కథ చదివే ఉంటారని అనుకుంటాను, ఎప్పుడో ఎలిమెంటరి స్కూల్ లో చదివామని మరచిపోకండి. ఒకసారి జగన్, ఇంకోసారి లోకేష్ మాకు ముఖ్య మంత్రులన్న మాట. మీరు ఇరువురు మీకు దక్కిన ఎంపి లతో కేంద్రం లో ఎవరు అధికారంలో వుంటే వారికి వారికి, మీరు ఇద్దరు తోడ్పడి ఆంధ్ర ప్రదేశ్ రావలసిన అన్ని నిధులు తేవాలి మీరు అనుకుంటే చేయగలరు ఒక పదేళ్ళు ఇలా చేస్తే ఢిల్లీ  దిమ్మ తిరుగుతుంది రాష్ట్ర ప్రగతికి తోడ్పడు తుంది. ఇది అనైతికము,అప్రజ్యాస్వామ్యం అని విజ్ఞులు అనవచ్చు(ఏదో మన దేశం లో పెద్ద ప్రజాస్వామ్యం వున్నట్టు) కాని లోకసభలో కెమరాలు చీకట్లు చేసి తెలుగువారి గొంతు కోయడం కంటే మంచిదే అని నా అభిప్రాయము. అన్నట్లు చెప్పడం మరచిపోయాను పెద్దమ్మ సోనియా, సోనియమ్మ ప్రధాని అయితే గుండు గీసుకుంటా అని ప్రతిన బూనిన చిన్నమ్మ సుష్మ కలిసి మెలసి తెలుగు దేశాన్ని త్రుంచి మనకు అందరికి గుండు కొట్టినప్పుడు లేని తప్పు, భిన్న ద్రువాలు అయిన మీరు ఇరువురు కలసి మన రాష్ట్ర ప్రగతి కోసం మంచి చేయడం లో తప్పుఎక్కడుంది  ఆలోచించండి. సర్వజన హితం పుణ్యం స్వార్థ తత్వం పాపం అని నమ్మిన వాడిని, తమిళ నాడు కంటే గొప్పగా కేంద్ర నిధులు అవ్వే వస్తాయి. స్వర్ణాంధ్ర, హరితాంధ్ర, ఐకమత్యాంధ్ర, అన్ని ఏర్పడు తాయి. భారత చరిత్రలో కొత్త అధ్యాయము ప్రారమ్భమవుతుంది. తమిళుడైన అన్నాదురై చెప్పినట్లుగా "ఈ దేశానికి రెండే శత్రువులు ఒకటి బ్రిటిషువారు (వెళ్ళిపోయారు) ఇంకోటి కాంగ్రెస్." నేను చెప్పినది మీరు చేస్తే వారు కూడా శాశ్వితంగా ఆంధ్రా నుండి వెళ్ళిపోతారు రాహుల్ గాంధీ యువరాజు గారికి బాజా భాజంత్రిలతో ఘనంగా "పెళ్లి" అవుతుంది (చెప్పలేము ఏజ్ బార్ అయిపొయింది, సంభందాలు వెతకాలి, ఎవరూ ముందుకు రావడం లేదు కష్టం మనమే వెతికితే బెటర్ లేదంటే ఇంకో దేశం ఆమె వచ్చి మన నెత్తిన కూర్చుంటుంది ).

ఇంకోమాట వైకాప నుండి "కా" తీసివేస్తే ఇంకా ఆనందము, ఎందు కంటే 2004,2009 లో కాంగ్రెస్ కు వచ్చిన సీట్లన్నీ కీర్తి శేషులు  శ్రీ రాజశేఖరరెడ్డి గారి భిక్షనే, దానిలో ఏమాత్రం సందేహం లెదు. కాబట్టి వైఎస్సార్ పార్టీ చాలు ఇంక కాంగ్రెస్సు ఎందుకు మధ్యలో, వుంటే చెడ్డపేరు (ఎలెక్షన్లు దగ్గర వుండడం వల్ల  ఇది కష్టము అర్థం చెసుకొగలను).

చివరగా నేను రాయలసీమలో నాగలూరు అను చిన్న పల్లెలో పుట్టి అమెరికాలో స్థిరపడిన జీవ రసాయనిక శాస్త్రవేత్తను, క్యాన్సర్ కణాలను చంపడం (ఎంతైనా ఫ్యాక్షన్ ఏరియా నుంచి వచ్చాను కదా), దాని నివారణకు ప్రజలు సులభంగా, చవుకగా  కొనుక్కోదగిన మందులు కనుక్కోవడం నా వృత్తి. మన రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ కూడా దేశాన్ని పీడిస్తున్న ఒక క్యాన్సర్ అని దాన్ని చంపే సులభొపాయం ఇది అని మీతో నా ఆలోచన పంచుకున్నాను. దీన్ని మీరు స్వీకరిస్తే చాలా సంతోషపడుతాను.

మీరు వినరు కొట్టుకుంటూనే వుంటారు నాకు తెలుసు అయినా నా తెలుగు తల్లి కన్నీళ్ళు చూడలేక కరిగిపోయి ఇలా రాసాను.

సదా తెలుగుతల్లి ని ప్రేమించి స్వార్థరహితంగా సేవిన్చాలనే సహృదయం వున్న
బాలు కరణం
అలబామ, అమెరికా

Wednesday, February 26, 2014

చీకట్లో చించేశామ్-మీ అందరి నోట్లో మట్టి కొట్టేశాం

*సినిమా రివ్యూ: చీకట్లో చించేశామ్ * సెకండ్ రిలీజ్
రేటింగ్‌:5/5
బ్యానర్‌: కాంగ్రెస్ ఫిలిమ్స్
తారాగణం: సోనియా,సుష్మ,కెసిఆర్,డిగ్గీరాజా,లగడపాటి,చిరంజీవి,విజయవాంతి(శాంతి), జైపాల్ రెడ్డి, కమల్ నాథ్,కమలనాథులు, ఇంకా కనీ విని ఎరుగని భారీ తారాగణం, వారి చుట్టూ విభజన కోసం వారి భజన చేసే వారి అనుచర గణం (టైటిల్స్ లో చూడగలరు)
కథ: సోనియా, మంత్రుల ముఠా ,శ్రీకృష్ణ కమిటి (కథ వ్రాసినా, ముఠా తమకు కావలసిన ఒక లైన్ మీద బిల్డ్ చేసారు) 
మాటలు : మౌన మోహన్ సింగ్    
పాటలు : మీవాడు డాక్టర్. బాలు కరణం పి హెచ్ డి ( తోలి పరిచయం)    
నేపధ్య గాయకులు : బాలసుబ్రమణ్యం (SP కాదు, కరణం) తదితరులు 
సంగీతం: జై రామ్ రమేష్  
కూర్పు: సుశీల్ కుమార్ షిండే   
పోరాటాలు : జగడపాటి
ఛాయాగ్రహణం: మీరా కుమారి    
నిర్మాతలు : సోనియా ,రాహుల్   
దర్శకత్వం: సోనియా  
పంపిణి దారులు : నైజాం-హనుమంతు &కో, సర్కార్,సీడెడ్-ఎవరూ ముందుకు రావడం లేదు 
విడుదల తేదీ: ఫిబ్రవరి 21, 2014

ఎన్నో రోజులుగా మూస కథల సినిమాలతో విసిగి వేసారిన తెలుగు ప్రజానీకాన్నిఉర్రూతలు ఊగిస్తూ రోజూ టీవీ లకు అతుక్కు పోయేలా చేసి, ఎన్నో వార్త సంస్థలకు ఎంతో  జీవన భ్రుతి కల్పించి, గత పది సంవత్సరాలుగా హైదరాబాదు,ఆంధ్ర ప్రదేశ్ లలో ప్రగతి లేకుండా చేసి, ప్రజలతో చెలగాటమాడి,ఇప్పుడా అప్పుడా తెలంగాణా అంటూ మనకు నిద్రలేకుండా చేసి, తలనొప్పి మందులసేల్స్ ను విపరీతంగా పెంచిన ఈ సినిమా కడకు రిలీజు కావడం తో తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఊపిరి పీల్చు కున్నారు,వుసూరు మన్నారు.

కథేంటి? (మీకు తెలుసు, కాని నా నోటితో వినండి,చదవండి )
ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అడిగిన మంత్రి పదవి ఈయ్యక పోవడంతో,నిరాశ చెంది కెసిఆర్ తెలంగాణా అనే అంశంతో వుద్యమిస్తాడు. అంతవరకూ నిస్వార్థ జీవులు ,కళాకారులు,అమర జీవులు, నిర్మించిన ఉద్యమం కెసిఆర్ రాక తో "కొత్త" పుంతలు తొక్కుతుంది ,పెద్దది అవుతుంది.  ఆ ఉద్యమం వల్ల తమ శత్రువైన చంద్రబాబు ను రాజకీయంగా అంతం చేయవచ్చునని నమ్మి కాంగ్రెస్ కెసిఆర్ తో పొత్తు పెట్టుకుంటుంది. కాంగ్రెస్ గెలుస్తుంది, కాని ముఖ్యమంత్రిగా,పాదయాత్ర చెయ్యడం వల్ల శారీరక ధారుడ్యం పెరిగిన రాయలసీమ "టైగర్" (శ్రీలంకతోఎట్టి సంభంధం లేని) రాజశేఖర్ ఉండడం వల్ల  కెసిఆర్ పప్పులు వుడకవు. పైగా యెమ్ సత్యనారాయణ రావు లాంటి యొధానుయొధులతోకెసిఆర్ ను ఒక ఆట ఆడించి ముప్పుతిప్పలు పెట్టి రాష్ట్రం లోని అన్ని చెరువుల నీళ్ళు తాగిస్తాడు. దురదృష్ట వశాస్తు రాజశేఖర్ హెలికాప్టర్ క్రాష్ లో చనిపోవడంతో జీవ సత్వాలు తెచ్చుకున్న కెసిఆర్ అన్న పానాలు మాని తెలంగాణ కావాలంటాడు. కెసిఆర్ అన్నము తిన్నాడని,ఆ ఉపవాసం తొండి అని లగడపాటి పేచి పెడతాడు అది ఎలా అంటే తానే దొంగ ఉపవాసం చేసి చూపిస్తాడు. అందువల్ల లగడపాటి మెయిన్ విలన్ లా కనిపిస్తాడు (కొంతమందికి మాత్రమె). సోనియా బర్త్డే సందర్భంగా అడ్డపంచి "ఛి"దంబరం తెలంగాణా ఇస్తామంటాడు దాంతో సీమ ఆంధ్ర భగ్గు మంటుంది. తమ రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పు వస్తుందని కాంగ్రెస్ తెలంగాణా ఇస్తాము కాని మాకేంటి  లాభం అని ఆలోచిస్తుంది (అహనా పెళ్ళంట లో కోట శ్రీనివాస రావు లాగా అన్నమాట) . కెసిఆర్ "సోనియా నువ్వు దెయ్యమంటాడు" నిన్ను రోడ్డు కు ఈడుస్తా అంటాడు . వెంటనే శ్రీకృష్ణ కమిటి అనే ఒక తుతు కమిటీ ని వేసి కొన్ని వేల మందితో తెలంగాణా అవసరమా? లేదా? అంటూ కొన్ని రోజులు కాలయాపన చేస్తారు. వేల పేజీల ఆ కమిటి రిపోర్ట్ ను మంత్రుల ముఠా అర్థగంటలో చదివేస్తుంది (రోబో సినిమాలో రజినికాంత్  కంటే త్వరగా అన్నమాట).  ఈ మద్యలో ఇవ్వడానికి తెలంగాణా ఏమైనా దోశ, పూరి,పెసరట్టా అన్న వెటకారాలు హాస్య ప్రధానమైన సంభాషణలు మనల్ని అలరిస్తాయి,ఆందోళన పెడుతాయి. కథ ఎక్కడా బోర్ కొట్టకుండా కాంగ్రెస్ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది .ఎలక్షన్లు దగ్గర పడడం తో తెలంగాణ అంశం మొదటికొస్తుంది. ఇస్తే లాభం అని తెలుసుకొన్న కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుంది. సీమ ఆంధ్ర భగ్గు మంటుంది. దాన్ని మసి పూసి,మాయచేసి మ్యానేజ్ చెస్తారు. మంత్రుల ముఠా  తెలంగాణా మీద చర్చిస్తారు,చర్చించి నట్టు నటిస్తారు. చించటానికి బిల్లు పంపుతారు. ఇక చూస్కో రోజు డిగ్గిరాజా వారు చిత్ర విచిత్ర విన్యాసాలతో ఆకట్టుకుంటాడు, సామిరంగా జనంతో ఆడుకుంటాడు. కాంగ్రెస్ ఇస్తుందా? ఈయ్యదా? అన్న దానిపై భయంకర మైన ఉత్కంట, గ్రిప్పింగ్ క్లైమాక్స్ తో,నటనా వైదుష్యం తో తెలుగు ప్రేక్షకుల నరాలు తెగిపొతాయి. చివరిగా పార్లమెంట్ సభల్లో గందరగోళం, కొట్టుకోవడాలు, పోస్టర్లు పట్టుకోవడాలతో పాటు లగడపాటి పెప్పర్ స్ప్రెయ్ చల్లడం జరుగుతుంది. కళ్ళు మంటలతో సభ్యులు పారిపోవడం జరుగుతుంది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో కానీ విని ఎరుగనటువంటి చెత్త అధ్యాయం మొదలవుతుంది. ఇంతలో కమలనాథ్ కమలనాథులను మ్యానేజ్ చేయడంతో చిమ్మ చీకట్లో తెలుగు"దేశం"(ప్రాంతం అని చదువుకోవచ్చు) చించి వేయబడుతుంది. సంతోషించిన కెసిఆర్ సోనియా నీవు మా దేవత అని కీర్తించ డంతో,సోనియా కెసిఆర్ ను పిలచి కమ్మని విందు ఇస్తుంది. కెసిఆర్ ఇకనుంచి సీమ ఆంధ్రులందరిని నా గుండెలో పెట్టుకుంటానని,ప్రేమిస్తాను అని చెప్పి, గుండె వైశాల్యం క్యాటగెరిలో గిన్నిస్ రికార్డు కొడతాడు.శుభం కార్డు పడుతుంది. ఆ విధంగా తెలుగు జాతికి అశుభం,అన్యాయం జరుగుతుంది . గమ్మత్తు గా కథ ఒక ప్రాంతంలో ఇప్పటికి సుఖాంతం లాగ,ఇంకో ప్రాంతం లో ధుఖాంతం రెండూ అవుతుంది ఇట్లాంటి కథ మీరు చూసి వుండరు,బహుశా రాదేమో. ఇండియా చల్లగా వుండాలంటే ఇంకే రాష్ట్రంలో జరగరాదు అని కోరుకుందాం.

కళాకారుల పనితీరు!
సినిమా ఫలితం ఏమైనా కానీ నటులందరూ తమ తమ పాత్రకి పూర్తి న్యాయం చెసారు. ఇరు ప్రాంతాలలో ప్రజలు మాత్రం అన్యాయమైపొయారు.  ఫ్లాష్ బ్యాక్ లో సోనియా భర్త అయిన రాజీవ్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన జైపాల్ రెడ్డి  చివరకు సోనియా భక్తుడు కావడం, భజన చేస్తూ ఆమెకు అంతర్జాతీయ దృక్పథం కట్టబెట్టడం, "కొదమసింహం" లాంటి చిరంజీవి సోనియా కంటి చూపుతో "చంటబ్బాయి"లా నిలబడి కాంగ్రెస్ లో "ఖైదీ " అయిపోవడం ఆశ్చర్యం,అసహ్యం  కలిగించే సన్ని"వేషాలు" ( సారీ! అచ్చు తప్పు )సన్నివేశాలు. సోనియా కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం గూర్చి ఎంత చెప్పినా చాలదు, వ్రాయడానికి ఈ  వెబ్ సైట్ చాలదు. మన రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి,త్రివిక్రమ్,పూరి,శీను వైట్ల ,వినాయక్ ఇంకా ఎందఱో..   వీరంతా ఈ రివ్యూ చదివిన వెంటనే అర్జెంటు గా 10 జనపథ్ లో ట్రైనింగ్ కు  వెళ్ళితే నే కాని వారికి దర్శకత్వంలో ఫ్యూచర్ వుంటుంది. లేదంటే వారి ఫ్యూచర్ కష్టమే అని ట్రేడ్ వర్గాల అభిప్రాయం

సాంకేతిక వర్గం పనితీరు:
ఈ రాజకీయ ఎంటర్‌టైనర్‌కి మ్యూజిక్‌ అందీయడం పెద్ద కష్టం, పుట్టుకతో కన్నడావాడైనా తెలుగు భాషలోని త్యాగరాజ కృతులు కర్ణాటక సంగీతం తో టచ్ వున్న జైరాం రమేష్, ఈ సినిమా కు సంగీతం ప్రసాదించాడు,తెలుగు రాని మంత్రుల ముఠా లో ఒకడై అలరించే సంగీతం ప్రసాదించాడు నిజంగా అభినందనీయుడు. కెసిఆర్ పై చిత్రీకరించిన "జాగోరే జాగో భాగోరేయ్ భాగో యు లఫంగి...  మై ఆవూంగి " అయితే నేమి, కోదండరామ్ తదితరులపై ట్యాంక్ బండ నేపధ్యంలో సాగే  గ్రూప్ సాంగ్ "పగుల గొట్టండి రా విగ్రహాలను" మనల్ని కొంచం భయపెడుతాయి,భాధ పెడుతాయి . చిన్నమ్మ సుష్మ పై స్లో సాంగు "చిన్నమ్మను మరువబోకు చిన్నా ఈ చిన్నమ్మను మరువబోకు చిన్న (మ్యూ"సిక్" పీసు) నీ హృదయ క"మలం"లో మా "కమలాన్ని" మరువబోకు చిన్నా ఆఆఆ .. " సెంటి"మెంటల్ "గా వుంది, పాట అయిన వెంటనే మధుయాస్కి గబుక్కున ఆమె పాదాలు ముట్టడంతో  ఆ పాట టచ్ చేస్తుంది (అద్భుతః ). ఆ పాట  తరువాత అందరూ కలసి నటించిన ఐటెం సాంగ్ "చీకట్లో చించేశాము మీ అందరి నోట్లో దుమ్ముకొట్టేశామ్ " సరిగ్గా కనపడలేదు ఈవిషయం లో మీరా కుమారి చాయా"గ్రహణం" బాగులేదు. అది తెలుగు జాతికి పట్టిన గ్రహణం. చివరగా శుభం తరువాత టైటిల్స్ వేసి నటుల పేర్లు వచ్చే సమయం లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో వచ్చే "మహారాజ రాజశ్రీ మాదొంగలలందరికి వందనాలు వంద వందనాలు" మాత్రం "సూత్రధారులు" సినిమాలో ని పాటలా అని పించింది. ట్యూన్స్, సీన్స్ సర్వసాధారణంగా కాపీ కొట్టే ఈరోజుల్లో అది ఓకే అని అని పిస్తుంది. మనకు మాత్రం జైరాం లో మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికినట్టే. తమన్ కు, దేవిశ్రీప్రసాద్ కు, ఆఖరికి మన కీరవాణికి, రెహమాన్ కూడా ఇంక గడ్డు కాలమే. పాటలు రాసే భాగ్యం,వాటిని పాడే భాగ్యం మాత్రం నాకు దక్కింది. పాటల రచయితగా,గాయకునిగా  నాకు నంది అవార్డు (ఎ స్టేట్ లోనో తెలియదు,రెండు అయిపోయాయి గదా !) వస్తుందేమో అన్న అనుమానం,భయం నన్ను వెంటాడుతూంది . మన మోహన్ బాబుగారు చెప్పినట్లు ఆ నంది  రావడానికి నేను గడ్డి వెయ్యాలో? లేదో? తేల్చుకోలేదు. ఫోన్ చేస్తే "రౌడీ "షూటింగ్లో బిజీ గావున్నట్లు వున్నారు. వారి తో మాట్లాడితే నే నాకు క్లారిటి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా నా ఇంటి ముందు గడ్డి ఇంకా కొయలేదు (అమెరికాలో మేమే కోసుకుంటాము, గొంతులు కాదు,గడ్డి మాత్రమే). కచ్చితంగా కొట్టగలను(ఎవర్ని అనుకోకండి, నంది అవార్డ్). నా అభిమాన తెలుగు పాట రచయితలు సిరివెన్నలగారు, రామజోగయ్య,అనంతశ్రీ రామ్,సుద్దాల గారు నిరాశపడకండి,భాధపడకండి ,డోంట్ లూస్ యువర్ హార్ట్ ప్లీజ్ ! కొత్త బ్లడ్ రావాలి కదా! ప్లీజ్ మీకు వేరే పాటలు రాసే చాన్సు లొస్తాయి. అవార్దులొస్తాయి, అఘాయిత్వం చేసుకోకండి ప్లీజ్! పైన దేవుడున్నాడు, కాని కిందనే జనాల్ని పీక్కుతినే రాజకీయ నాయకులున్నారు.

హైలైట్స్‌:
  • లగడపాటి పెప్పర్ స్ప్రే ఎపిసోడ్ బాగా పండింది (సారీ! "మండింది")
  • క్లైమాక్స్ గ్రిప్పింగ్ 
  • డిగ్గి రాజా తదితరుల హాస్య (వెకిలి,వ్యంగ్య)సంభాషణలు
డ్రాబ్యాక్స్‌:
  • డల్‌ ఫస్ట్ హాఫ్‌
  • బిల్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ చిన్చేటప్పుడు కెమెరాలు పనిచేయలేక పోవడం
  • మీరా కుమారి చాయా"గ్రహణం "
విశ్లేషణ:
‘నేను మొదటి సారి రివ్యూ రాయడం వల్ల కొన్ని సంఘటనలు,పాత్రలు మరిచి ఉండ వచ్చు. ఈ చిత్రం లోని పాత్రలు అవి కేవలం నిజాలు అవి వారిని ఉద్దేశించబడినవే  వారి నట ప్రతిభను బట్టి నాకు తోచిన రీతిలో విశ్లేషించాను అంతే. నేను తప్పు గా విశ్లేషించి ఉండవచ్చు.ఇంకా ఇప్పుడే ఎంటరయ్యాను కదా. "అర్థం చేసుకోరూ!". సిరాశ్రీ తదితరుల అంత అనుభవం లేదు సినిమాలో ఎంటర్‌టైన్‌ చేసే  సందర్భాలు చాలా ఉన్నాయి. ‘ఎందుకొచ్చాం బాబూ’ అని బోర్‌ ఫీలయ్యే సన్నివేశాలూ లేనే లేవు నన్ను నమ్మండి . చివరి వరకు కూర్చోగలమంటే,ఆ తరువాత కూడా లెయ్యలేమంటే అందుకు కారణం సోనియా దర్శకత్వమే, తను పాపం " పెళ్లి" కూడా  చేసుకోకుండా ఈ సినిమా పై బోల్డంత కర్చు,తన ఫ్యూచర్ పెట్టిన రాహుల్ బాబు అభినందనీయుడే. నైజాం లో "మగధీర" రికార్డు మటాష్ అవుతుంది అంటున్నారు (ఫస్ట్ డే). సర్కార్,సీడెడ్ ల లో ఒక సారి చూసి,చూడలేక  ఛి కొడుతున్నారు. చూసే వారికి దీంతో నిరాశ తప్పకపోవచ్చు. ఈ సినిమా ఆడదు. ఈ ఏరియా లలో సోనియా,రాహుల్ బాబు డబ్బు,పేరు,గౌరవం,ఫ్యూచర్  ఒకటేమిటి  సమస్తం సంకనాకి పోయినట్టే అని రాజకీయ ట్రేడ్ వర్గాల భోగట్టా. 
ఇంకా మూడు  పాటలు షూటింగ్ చేసి ఎడిటింగ్ సమయంలో తీసివేయ వలసి వచ్చింది  అవి మీకోసం, ఒకటి మౌనమోహన్ పైన స్లొసాంగ్  "మూగవైన నెమిలె నగుమోమె చాలులె.. దొంగమనసు దాగదులే అది అద్వానికి తెలియునులే.... లులులులులూ ..... (పియానో బీటు)" రెండో పాట రీమిక్స్ చిరంజీవి, విజయవాంతి (శాంతి) పైన ""భద్రాచలం" కొండ సోనియమ్మా గారి జండా  వేసిందిరా మన నెత్తిన బండా  టపుటపు టపోరి కన్యాకుమారి... మూడు "సోనియా సోనియా ఘాటు ఘాటు  సోనియా (పెప్పేర్ స్ప్రెయ్ కదా).... ఎందుకె మాకిచ్చావు షాకు "
బోటమ్‌ లైన్‌: హమ్మయ్య తెలంగాణా వచ్చింది, సీమాంధ్రలో కాంగ్రెస్ చచ్చింది !

చివరిగా పాటలు రాసినందుకు,మధురంగా పాడినందుకు రెమ్యునరేషన్ అడిగితే నాకు 5 ఏళ్ళు స్వయంప్రతిపత్తి నెక్స్ట్ బడ్జెట్ లో మిగులు చిల్లర పైసలు,తొక్క ఇస్తామని చెప్పారు.  ఇందా అని,పేస్ బుక్ మరియు యు. ఎస్ డిస్ట్రిబ్యూషన్ "చేతి" లో పెట్టారు. ఎంతైనా భస్మాసుర "హస్తం" గుర్తుకదా. మొత్తం పాటలు, Mp3 ఫైల్స్ నా దగ్గర వున్నాయి ఏమంటే నేనే పాడాలి (ఈ కాలం సంగీత దర్శకుల లాగా వేరే వాళ్ళకు ఛాన్స్ ఈయ్యను) యు ఎస్ డిస్ట్రిబ్యూషన్ డీటెయిల్స్  కోసం నన్ను సంప్రదించగలరు.ఇంకా ఎవరూ కాంటాక్ట్ చెయ్యలేదు, షేర్ క్లిక్ చేసుకొని నన్నుగట్టేకించండి ప్లీజ్ ,గట్టు నన్ను మాత్రమే నన్ను మాత్రమే, కాంగ్రెస్సును కాదు సుమీ!

నిజంగా మీ"అందరివాడు"  (అయ్యో రామా  చిరు సినిమా టైటిల్ అనుకోకండే)
ఇక సెలవు, ఉంటాను మరి 
బాలు కరణం

చిరంజీవికి చిన్నలేఖ

 
 
నా మాజీ అభిమాన హీరో అయిన శివశంకర వరప్రసాద్ అను చిరంజీవి గారికి,

అయ్యా నేను మీకు తెలీదు మీరు మాత్రం నాకు బాగా తెలుసు ఎలాగంటే మీ "శుభలేఖ"లు అచ్చు అయ్యి, మమ్ములను కడుపుబ్బనవ్వించిన మంచి వాడు,గొప్ప నటుడైన పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి అల్లుడని, బాగా "స్టెప్పులు" వేస్తారని మీ అభిమానిని అయ్యాను. బాగుంది మీరు బాగా స్టెప్పులు వేసారు,మమ్ములను ఉర్రూతలు వూగించారు ఇది సత్యం. కాని ఎందుకో 2008 నుండి మీరు  వేసిన స్టెప్పు లన్ని తప్పు తున్నాయి మాస్టారు!. మీరు తొందరగా ప్రభుదెవాను కాంటాక్ట్ చేస్తే మంచిదెమొ. మీ లైఫ్ ను "ఛాలెంజి" గా తీసుకొని "స్వయంకృషి" తో పైకి వచ్చి మీ నటనా కౌశలంతో "కొదమసింహం" అయి మీ సాటి నటులలో "ఇంద్ర "పదవిని అలంకరించి జగదేకవీరుడైన  మీరు "మోసగాళ్ళు,నకిలీ మనుషులు, కిరాయి రౌడీలు, స్టేట్ రౌడీలు,దొంగలు,అడవిదొంగలు, కొండవీటి దొంగలు గూండాలు కిరాతకులు రాక్షసులు" సంచరించే రాజకీయ అరణ్యం లో అడుగు పెట్టారు. మీరు వచ్చినప్పుడు సామాజిక న్యాయం చేస్తాడని సామాన్యులు, కష్టంతో రెక్కాడితే డొక్కాడని బ్రతుకు గడిపే "రిక్షావొడు" కూడా గంపెడాశ తో మీరు వచ్చి కుళ్ళు రాజకీయాలు కదిగివెస్తారని ప్రజల ప్రాణా లు తీసే నవీన రాజకీయ "యముళ్ళకు మొగుడవు" తావని, సామాన్య బీద ప్రజలకు "ఆపత్భాంధ వుడు" అవుతావు అన్న ఆశతో మీ వైపు "న్యాయం కావాలి" అని చూసారు. నిజం మీరు అలా కనిపించారు. బాగుంది ప్రజారాజ్యం పెట్టారు ఎన్ టి యార్ లా కాకున్నా ఒక మోస్తరు గెలిచారు. మీ మీద అభియోగాలు వచ్చాయి.  రాజకీయం లో దిగాక ఆమాత్రం బురద అంటుకోవడం ఓకే. మీరు తిన్నారు అని, టికెట్లు అమ్ముకున్నారని అన్నారు లోకులు పలుకాకులు దుర్మార్గులు అన్నారు. సరే మేము నమ్మలేదు మీరు లావు పెరగక పోవడంతో మీరు తినలేదని, సిని హీరో అయిన మీరు టికెట్స్ అమ్ముకుంటే తప్పు లేదని ("దొంగమొగుడు" లో అమ్మారు కదా మేం చూసాం సార్ ) అనుకున్నాము. కాని కాంగ్రెస్స్ లో కలిసిపోయారు చూసారా అది మాస్టారు "రాంగ్ స్టెప్", అక్కడనుండి విజయవాంతి (శాంతి) తో మీ డాన్సు సీక్వెన్స్ కానీ మీ డైలాగు డెలివరీ కానీ ఏది పండలేదు,బాగుండుట లేదు. మీరు నొచ్చుకోవచ్చు బట్ ఇట్స్ ట్రూ. హాయి నిచ్చే అసత్యం కంటే జీవితాన్ని బాగు చేసే సత్యమే మంచిది మాస్టారు. మీరే కాంగ్రెస్ లో కలిసిపోకుంటే  ఇప్పుడున్న పరిస్థితుల్లో సమైఖ్యాంధ్ర హీరో లా వెలిగి పోయే అవకాశం వుండేది.  మీ మాస్ అప్పిలుకు, మీకు క్రితం వున్నా మంచి పేరుకు దుమ్ము రేపేవారనుకో (బాబు కు, జగన్ బాబుకు కష్టమై పోయేది), ఎం చేస్తాం చెప్మా విధి వక్రీకరించింది సుమీ! పేస్ టర్నింగ్  ఇచ్చుకోవడానికి కూడా కావడం లేదు. చిన్న మెదడు చితికి పొయిన్ది. "మగధీరుడై", "పులి" లా బ్రతికిన  మీరు "హిట్లర్"  (నేనటం లేదు జగన్ నే అన్నాడు నేను విన్నాను "సాక్షి"కావాలంటే ఫోన్ చెయ్యండి) లాంటి సోనియా వద్ద "చంటబ్బాయి" లా చేతులు కట్టుకోవడం ఏంటి సార్, "అల్లుడా మజాకా" అయిన రాబర్ట్ వాద్రా వద్ద మీరు గులాం అయిపోవడం మాకు నచ్చడం లేదు . వట్టి కోతలరాయుడై ఇటు పెళ్లి కాక అటు ప్రధానికి పనికి రాక వట్టి పప్పుసుద్ద లాంటి రాహుల్ తో కలసి "తోడుదొంగ" గా మారటము ఏంటి సార్  అబ్బే చాలా అసయ్యంగా వుంది. మరి ఆంధ్రప్రదేశ్ చివరాఖరి చీప్ మినిస్టర్ గా మిమ్ములను ముగ్గులోకి దించుతున్నరని విన్నాను. అది నిజమో ,అపద్దమో  తెలియడం లేదు ఈ రోజు ఏ వార్త నిజమో అపద్దమో తెలుసుకోవడం కష్టం అలా మారింది మన సమాజం. ప్లీజ్! చిరంజీవి గారు వద్దండి "మృగరాజు" లాంటి మీరు నాదెళ్ళ భాస్కర్ రావు లాగ "నెలరాజో" మూడు నెలలరాజో కారాదు. మీ "సంఘర్షణ" అర్థం చేసుకో గలను కాని వద్దుగాక వద్దు ఈ రాజకీయాలకు స్వస్తి పలికి ఇంకా పగలకుండా మిగిలిన మీ పిచ్చి అభిమాన హృదయాలలో "అందరివాడు" నటనలో వేరే హీరోలకు అందనివాడులా  "చిరంజీవి"లా చిరకాలం నిలిచిపోవాలని సహృదయం తో కోరుకుంటున్నాను
కాబట్టి నేను చెప్పే దేమిటంటే నా వుత్తరం చదివితే మీకే తెలుస్తుంది మీ సినిమాలు ఎంత బాగా చూసానో అని, ఇంతచేప్పినా నా మాట వినకుండా మీరు చీప్ మినిస్టర్ అయ్యారో అది మీ ఖర్మ. అప్పుడు మీ సినిమాల టికెట్స్ పై పెట్టిన డబ్బు (మీకు చేరింది పంపిణి దారుల ద్వారా) ఎలాగు అడగలేను నేనంత చీప్ కాదండి , ఏదో దేవుడి దయవల్ల,పెద్దల ఆశీర్వాదం వల్ల ఇప్పుడు ఆర్థికంగా నిలదోక్కుకున్నాను. కాని మీ మీద వేస్ట్ చేసిన కాలం (చాలా  విలువైనది అని విజ్ఞుల అభిప్రాయం, అని విన్నాను సినిమాలు చూసే సమయం లో నాకు తట్టలేదు ), మీ పై అభిమానంతో పారేసుకున్న నా గుండెను వెనక్కిమ్మని కొరుతున్నాను.
నన్ను "చూడాలని వుంది" అని అని పిస్తే "స్నేహం కోసం"  కాంటాక్ట్ చెయ్యండి బుక్స్ పారేసి పేస్ బుక్ లో మీకోసం చూస్తూ వుంటాను (ఇది వేరే టైం వేస్టేమో!)
మీ రాజకీయ జీవితం తో రాజీ పడలేని ఒక పిచ్చి మాజీ అభిమాని
బాలు కరణం